అక్రమ సంబంధాలు వద్దన్నందుకు భార్యను నరికి చంపిన భర్త

  •    మద్యం మత్తులో దారుణం.. 
  •     మనుమడిని పక్క గదిలో ఉంచి తల, మొండెం వేరుచేసి హత్య
  •     నిర్మల్​జిల్లా మామడ మండలంలో ఘటన

నిర్మల్/లక్ష్మణచాంద, వెలుగు : అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దన్నందుకు భార్యను భర్త అతి కిరాతకంగా నరికి చంపాడు. తల, మొండెం వేరు చేశారు. నిర్మల్  జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిర్మల్ రూరల్  సీఐ శ్రీనివాస్  తెలిపిన వివరాల ప్రకారం.. దిమ్మదుర్తి గ్రామానికి చెందిన సూర నరసయ్య (61), లక్ష్మి (49) భార్యాభర్తలు. వారికి ముగ్గురు సంతానం. అందరికీ పెండ్లిళ్లు చేశారు. చిన్న కొడుకు విదేశాల్లో పనిచేస్తున్నాడు. పెద్ద కొడుకు వారితోనే ఉంటుండగా, కూతురిని అదే గ్రామంలో ఇచ్చారు. అయితే, కొద్ది కాలంగా నరసయ్య మద్యానికి బానిసై అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడు.

ఈ విషయంపై ఆయన భార్య లక్ష్మి పలుమార్లు హెచ్చరించింది. అయినా నరసయ్య ప్రవర్తనలో మార్పు రాకపోగా.. హెచ్చరించిన భార్యను పలుమార్లు తీవ్రంగా కొట్టాడు. ఈనెల 29న నరసయ్య మద్యం మత్తులో ఇంటికి వచ్చి కొత్త బైక్  కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని భార్యను హెచ్చరించాడు. అప్పటికే తన భర్త నిర్వాకాలపై లక్ష్మి మామడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినా తరచూ మద్యం తాగి రావడం, ఆమెను చితకబాదడం పరిపాటిగా మారింది. మద్యం, అక్రమ సంబంధాల విషయంలోనూ తనకు అడ్డువస్తున్నదన్న భావనతో భార్యను చంపాలని నరసయ్య పథకం వేశాడు.

ఇంట్లో ఉండే పెద్ద కొడుకు భార్యను తీసుకొని అత్తారింటికి వెళ్లడంతో ఇదే అదునుగా భావించాడు. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న లక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. తల, మొండెంను వేరే చేసి అతి కిరాతకంగా చంపేశాడు. కూతురి ఆరేండ్ల కొడుకు వారితోనే ఉండగా అతడిని పక్క గదిలోకి తీసుకెళ్లి గొళ్లెం వేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. లక్ష్మిని చంపిన తర్వాత పారిపోయాడు. బాలుడి ఏడుపు విన్న చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అలర్ట్​అయిన పోలీసులు నిందితుడి కోసం గాలించగా శనివారం న్యూ సాంగ్వి గ్రామం వద్ద పట్టుబడ్డాడు.