
- వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఘటన
నల్లబెల్లి , వెలుగు : భార్యను చంపి భర్త పరారయ్యాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రాంపూర్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్‌కు చెందిన పురం సారంగపాణి, అదే గ్రామానికి చెందిన మౌనిక (31) లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సారంగపాణి రాంపూర్‌కు సర్పంచ్‌గా పనిచేశాడు.
కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంటి పోషణ భారం మౌనికపై పడింది. కూలినాలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఆమె పోషిస్తోంది. భార్యపై సారంగపాణి అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారం రోజుల పాటు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్త వేధింపులపై సర్పంచ్‌కు మౌనిక ఫిర్యాదు చేసింది. దీంతో నా పైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మద్యం మత్తులో అర్ధరాత్రి మౌనికను సారంగపాణి చిత్రహింసలకు గురిచేసి గొంతు పిసికి చంపాడు.
ఆమె చనిపోయిందని కన్ఫం చేసుకున్నాక ఇంటి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం పిల్లలు తమ తల్లి విగతజీవిగా కనిపించడంతో బోరుమన్నారు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి డెడ్‌బాడీని మార్చురీకి తరలించారు.