హైదరాబాద్లో దారుణం జరిగింది. లలిత్ బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆజం మేనల్లుడు సయ్యద్ ముర్తుజా అనస్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, తల్వార్లతో దాడికి పాల్పడ్డారు. కార్పొరేటర్ కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు వివరాలను ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కార్పొరేటర్ ఆఫీస్ బయట నిల్చుని ఉన్న అనస్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు.
అనంతరం హుటాహుటిన అనస్ ను ఓవైసీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారు. అక్కడి నుంచి అనస్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారని ఆయన తెలిపారు. అన్వరుల్ ఉలూం కాలేజీలో అనస్ ఇంటర్ చదువుతున్నాడని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. అనస్ హత్య కేసు దర్యాప్తునకు మొత్తం ఐదు టీమ్ లు ఏర్పాటు చేశామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.