మందుపాతర పేలి జవాన్‌‌కు గాయాలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లా కెరింపు అటవీ ప్రాంతంలో శనివారం మందుపాతర పేలడంతో ఓ జవాన్‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్‌‌ చేస్తున్న సమయంలో ఓ జవాన్‌‌ మందుపాతర మీద కాలు పెట్టడంతో అది పేలింది. గాయపడ్డ జవాన్‌‌ను బీజాపూర్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు.

మరో వైపు నారాయణ్‌‌పూర్‌‌ జిల్లా కొహెక్మేటా పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని చ్చాపాల్​ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన నాలుగు మందుపాతరలను జవాన్లు వెలికితీశారు. ఈ  గ్రామంలో శుక్రవారం ఓ మందుపాతర పేలడంతో పశువు చనిపోయింది. ఇద్దరు గ్రామీణులు తృటిలో తప్పించుకున్నారు. దీంతో జవాన్లు బాంబు స్క్వాడ్‌‌తో గ్రామ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేయగా నాలుగు మందుపాతరలు దొరికాయి.