
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2025, మార్చి 22 కల్లా నోటీసులకు రిప్లే ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం 2025, మార్చి 25వ తేదీకి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం (మార్చి 4) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి రీజనబుల్ టైమ్ అంటే వాళ్ల పదవి కాలం ముగిసే వరకా..? ఇలా అయితే ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి..? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పండని ప్రతివాదులను ప్రశ్నించారు. ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అనే తీరు సరికాదని జస్టిస్ బీఆర్ గవాయి అసహనం వ్యక్తం చేశారు.
కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్‌ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్.. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణీత సమయంలోగా అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ సెక్రెటరీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.
ఈ పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తీర్పు వెలువరించింది. అయితే, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్‌పై మంగళవారం (మార్చి 4) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.