హైదరాబాద్: దారుసలాం ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుపడింది. పార్లమెంట్ ఎన్నికల తనిఖీల బృందం మంగళట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుసలాం ప్రాంతంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టగా దాదాపు కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. మియాపూర్ ప్రాంతానికి చెందిన కొత్త రవిచంద్ర, జస్తి సురేష్ లు బేగంబజార్ ప్రాంతంలో కోటిన్నర నగదు తీసుకుని డ్రైవర్ చిత్తల శ్రీనివాస్ తో కలిసి TS15 ES 5999 నెంబర్ గల కారులో వెళ్తున్నారు.
దారుసలాం ప్రాంతం వద్ద గోషామహాల్ పార్లమెంట్ ఎన్నికల తనిఖీల సిబ్బంది శంకర్ నాయక్, చంద్రశేఖర్, ఇతర అధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించారు. కోటిన్నర నగదుతో పాటు నగదును తరలిస్తున్న కొత్త రవిచంద్ర, జస్తి సురేష్ లతో పాటు డ్రైవర్ చిత్తల శ్రీనివాస్ లను మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నగదుపై పోలీసులు పూర్తిగా విచారణ చేపడుతున్నారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హవాలా డబ్బుగా పోలీసులు భావిస్తున్నారు. కోటిన్నర నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించి కేసును విచారణ చేపడుతామని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.