రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యేలపై ఓటర్ల ఒత్తిడి

మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజీనామాలపై ప్రజల నుంచి పెద్ద  సంఖ్యలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొంతమంది ఓటర్లు తమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరుతున్నారు. రాజీనామా చేస్తేనే తమ నియోజకవర్గంతో పాటు తమ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల్లోనే ఏకంగా ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసిన ఓటర్లు.. రాజీనామాలు చేయాలంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేశారు.

మొన్న మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నిన్న నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఇవాళ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. తమ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల నుంచి రాజీనామాలు చేయాలంటూ ఫోన్లు వచ్చాయి. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఫోన్ 

జనగాం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి రాజీనామా చేయాలని కోరాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే..మునుగోడు నియోజకవర్గం తరహాలో తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయని చెప్పాడు.  ప్రజలు, కార్యకర్తల నుంచి తరచూ ఫోన్లు వస్తుండడంతో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో పాటు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు తమకు ఫోన్లు చేసిన వారిని అనుచరులతో బెదిరిస్తున్నారు. 

బోథ్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ రాస్తారోకో
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రాజీనామా చేస్తేనే రోడ్డు వేస్తారని  ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఆరు గ్రామాల ప్రజలు ఆదివారం నిపాని గ్రామం వద్ద రాస్తారోకో చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరసన చేపట్టారు. జందాపూర్ నుంచి కరంజీ వరకు 46 కిలోమీటర్ల దూరం ఉంటుందని, 33 కిలోమీటర్ల రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా మారిందన్నారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే రోడ్డు బాగు పడుతుందన్నారు.

జహీరాబాద్ ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్ 
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు మనియార్ పల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అక్రమ్ షా ఆదివారం ఫోన్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని కోరాడు. రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం తరహాలో తమకు లబ్ధి చేకూరుతుందని విజ్ఞప్తి చేశాడు. సీఎం కేసీఆర్ ను అడిగి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మాణిక్ రావు అక్రమ్ షాకు సర్దిచెప్పారు ఎమ్మెల్యే మాణిక్ రావు. 

రాజీనామా చేయాలంటూ అందోల్ ఎమ్మెల్యేపై ఒత్తిడి
అందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు అల్లాదుర్గం మండలం మాందాపూర్ గ్రామం నుంచి కృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేసి రాజీనామా కోరాడు. ఇప్పటికే తన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.. సదరు వ్యక్తికి నచ్చజెప్పాడు.

రాజీనామా కోరిన వ్యక్తిపై ఫిర్యాదు
నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్ రెడ్డికి శనివారం ఫోన్​ చేసి పదవికి రాజీనామా చేయాలని కోరిన బీజేపీ శివ్వపేట మండలం ఉసిరికపల్లి ప్రధాన కార్యదర్శి అశోక్​పై టీఆర్ఎస్​ నాయకులు ఆదివారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపు
రాజీనామా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందంటూ రెండు రోజుల క్రితం మెదక్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డికి రామాయంపేటకు చెందిన స్వామి ఫోన్​ చేశాడు. ఆదివారం ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు స్వామికి ఫోన్​చేసి బెదిరించారు. సారీ అంటూ వాయిస్​ మెసేజ్​ పెట్టాలని హెచ్చరించాడు.

ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ ఓటరు డిమాండ్ చేసిన వార్తను V6  న్యూస్ చానెల్, వెలుగు పేపర్ లో రావడంతో మిగతా నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ వస్తున్న వార్తలను ప్రసారం చేస్తున్నV6 న్యూస్ చానెల్ ను బ్యాన్ చేయాలంటూ యూట్యూబ్ లో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.