
- జిల్లా వ్యాప్తంగా మల్లికార్జునస్వామి జాతర్లు
- భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
- కిక్కిరిసిన ఐనవోలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ వైపు చూసినా జాతర్ల సందడే కనిపిస్తోంది. ప్రతి ఏటా సంక్రాంతిని పురస్కరించుకొని జిల్లాలోని పలు చోట్ల మల్లికార్జునస్వామి జాతర్లను వైభవంగా నిర్వహిస్తున్నారు. కొత్తకొండ, ఐనవోలు మొదలుకొని అటవీ ప్రాంతమైన ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో జాతర్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు : హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. డోలు చప్పుళ్లు, బోనాలు, శివసత్తుల పూనకాల మధ్య ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. సంక్రాంతి రోజున ప్రభబండ్ల ఊరేగింపు కనులపండువగా సాగింది. ఎడ్ల బండ్లను రంగు రంగుల పూలతో అలంకరించి ఆలయం చుట్టూ తిప్పారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు.
బుధవారం నిర్వహించనున్న మహా సంప్రోక్షణతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఐనవోలు మల్లన్నను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. అలాగే వర్ధన్నపేట మండలం కట్య్రాలలో జరిగిన మల్లన్న జాతరకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వైభవంగా పుట్టమల్లన్న జాతర..
ములుగు, వెలుగు : ములుగు మండలం జగ్గన్నపేటలో పుట్ట మల్లన్న జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు బోనాలతో తరలివచ్చి స్వామి వారిక సమర్పించారు. మంత్రి సీతక్క కుమారుడు, యువజన కాంగ్రెస్ నాయకుడు ధనసరి సూర్య పుట్ట మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
మచ్చర్లలో ఎల్లమ్మకు బోనాలు
గూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల శివారులోని దేవుడి గుట్టపై మల్లికార్జునస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. మంగళవారం గుట్ట కింద ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద పట్నం వేసి బోనం సమర్పించారు. జాతరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ హాజరై మల్లికార్జునస్వామిని, ఎల్లమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఆయన వెంట యాదవ సంఘం నాయకులు నర్సయ్య, మల్లేశ్, ఐలయ్య, రాములు, పర్వతాలు, వెంకన్న, కృష్ణ ఉన్నారు.
గోపనపల్లిలో దూడల మల్లికార్జునస్వామి జాతర
పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లిలో మంగళవారం దూడల మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా కనుమ రోజున జాతరను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా భక్తులు పట్నాలు వేసి, మల్లన్నకు బోనాలు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా లక్ష్మీ నరసింహుడి వరపూజ
మంగపేట, వెలుగు : సంక్రాంతి సందర్భంగా ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహుడి వరపూజను నిర్వహించారు. ఇందులో భాగంగా నృరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను మల్లూరులోని సీతారాముల ఆలయ ప్రాంగణంలోని సంక్రాంతి మండపానికి తీసుకొచ్చారు. అనంతరం వరపూజ నిర్వహించి, మే 23న స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో శ్రవణం సత్యనారాయణ, ఆలయ చైర్మన్ నూతులకంటి ముకుందం, ప్రధాన అర్చకుడు రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర్‌శర్మ, అర్చకులు కారంపొడి పవనకుమారాచార్యులు పాల్గొన్నారు.