శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి

అలంపూర్, వెలుగు: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. ముందుగా గణపతికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు జరిపించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా కనిపించింది. 

సాయంకాలం మహిళలు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలంపూర్ సమీపంలోని పాపనాసి శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు తుంగభద్రా నదిలో కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. ఇదిలాఉంటే జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. 

అర్చకులు వారికి స్వాగతం పలికారు. వినాయక, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేశారు. వనపర్తి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.