రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ నేత ఫోన్ 

జగిత్యాల జిల్లా : మునుగోడు ఉప ఎన్నికతో ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్లు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తరచూ ఫోన్లు వస్తున్నాయి. రాజీనామా చేస్తేనే తమ ఊరుతో పాటు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని కొంతమంది కార్యకర్తలు తమ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. దీంతో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కూడా రాజీనామా చేయాలంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత సల్వాజి మాధవరావు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాల్ చేసి రాజీనామా చేయాలనడం పద్ధతేనా..?దీన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఉండి ఏం ప్రయోజనం లేదని, వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరాడు. 

మాధవరావు ప్రశ్నలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కూల్ గా సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఎందుకు చేయాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాజీనామా చేస్తేనే విద్యావంతుల సమస్యలు పరిష్కారమవుతాయని మాధవరావు బదులిచ్చాడు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మాధవరావు అనుచరునిగా కొనసాగుతున్నారని తెలుస్తోంది.