బైక్‎పై వెళ్తుండగా టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి

తొక్కిసలాట ఘటనతో గత నాలుగు రోజులుగా వార్తల్లో ఉన్న తిరుపతిలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తోన్న టీటీడీ ఉద్యోగిపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ముని కుమార్ అనే వ్యక్తి టీటీడీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం (జనవరి 11)  సాయంత్రం విధులు ముగించుకుని బైక్‎పై ఇంటికి వెళ్తున్నాడు. 

ఈ క్రమంలో తిరుపతిలోని సెన్స్ సెంటర్ వద్ద ముని కుమార్‎పై ఒక్కసారిగా చిరుత పులి దాడి చేసింది. స్థానికులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో భయంతో చిరుత వెనుదిరిగింది. వెంటనే చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డ మునిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన తొక్కి సలాట ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భక్తులు.. ఇవాళ టీటీడీ ఉద్యోగిపై చిరుత పులి దాడి చేయడంతో మరింత భయాందోళనకు గురి అవుతున్నారు. 

వరుసగా ఘటనలతో గత నాలుగు రోజులుగా టీటీడీ వార్తల్లో నిలుస్తోంది. 2025, జనవరి 8వ తేదీన వైకుంఠ ఏక ద్వారా దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన పూర్తిగా మరువకముందే ఇవాళ టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి చేయడం గమనార్హం.