చాకచక్యంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
ఒడిశా : బావిలో పడిన చిరుతపులిని అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఒడిశా రాష్ట్రం సంబల్‌పూర్ జిల్లా హిందోల్ ఘాట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హిందోల్ ఘాట్ సమీపంలోకి మంగళవారం (ఈనెల 7న) సాయంత్రం వచ్చిన చిరుత ఉన్నట్లుండి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. బావి నుంచి బయటకు వచ్చేందుకు చాలా సేపు ప్రయత్నించింది. అయితే.. బావి లోతుగా ఉండటంతో పాటు నీళ్లు కూడా ఉండటంతో పైకి ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. అటువైపుగా వెళ్తున్న స్థానికులు పులి గాండ్రింపులు వినపడటంతో భయంతో చుట్టుపక్కల చూశారు. దగ్గరలోని బావి నుంచి ఆ అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించి బావి వద్దకు వెళ్లి చూడగా చిరుత పులి కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
#WATCH | Odisha Fire dept officials rescued a leopard that fell into a well near Hindol ghat in Sambalpur district
— ANI (@ANI) June 9, 2022
"We got info about it from the Forest dept. We went to that place and rescued the leopard with the help of a wooden ladder," said Fire officer Mishra Kishan (08.06) pic.twitter.com/v1XfrSlflP
ఘటనా స్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ముందుగా తాళ్ల సహాయంతో పులిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండాపోవడంతో నిచ్చెన సహాయంతో చిరుతపులిని బయటకు తీశారు. నిచ్చెనకు తాళ్లను కట్టి బావిలోకి వదిలారు. దీంతో ఆ నిచ్చెనను పట్టుకున్న చిరుతపులి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ నెమ్మదిగా పైకొచ్చింది. వెంటనే అక్కడి నుంచి దగ్గరలోని అడవుల్లోకి పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.