వరంగల్: గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తోన్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన బుధవారం ఉదయం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హైచ్పీ గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఓ లారీ వరంగల్ నుండి బయ్యారం వెళ్తోంది. ఈ క్రమంలో ఖానాపురం(మం) కేంద్రం వద్దకు రాగానే లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాలను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో రెండు విద్యుత్ స్థంభాలు విరిగిపోగా.. లారీలోని సిలిండర్లు రోడ్డుపై పడిపోయాయి.
డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణప్రాయం నుండి బయటపడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన గ్యాస్ సిలిండర్లను స్థానికుల సహయంతో తొలగించారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.