ఇవాళ (ఫిబ్రవరి 8) దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల వెలువడుతున్న క్రమంలో.. మరి కాసేపట్లో పీఠం ఎవరి సొంతం అవుతుందో తేలిపోనుంది. 2015 నుంచి అధికారంలో ఉన్న ఆప్ మరోసారి రాజధానిలో జెండా ఎగురవేసేది తామేనని ఆప్ ప్రకటించింది. ఎక్జిట్ పోల్స్ అన్నీ దాదాపు బీజేపీకే అధికారం అని, 45 నుంచి 55 సీట్లు గెలుచోనుందని తేల్చేశాయి. దీంతో ఈ సారి ఢిల్లీ పీఠం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. అయితే గత రెండు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి.. ఢిల్లీ ప్రజల ఓటింగ్ సరళి ఎలా ఉందో తెలుసుకుందాం.
గత రెండు ఎలక్షన్ల ఫలితాలు:
ఢిల్లీలో1998 నుంచి 2013 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2013 నుంచి ఢిల్లీలో ఆప్ గట్టి ప్రభావం చూపుతోంది. 70 సీట్లున్న ఢిల్లీలో 2013 లో బీజేపీ 31 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే ఆప్, కాంగ్రెస్ కలిసి అధికారం చేపట్టినా.. 49 రోజుల్లోనే ఆ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్రపతి పాలన విధించారు.
ఇక 2015లో అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన ఆప్ 70 స్థానలకు గాను 67 సీట్లలో గెలిచి సంచలన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 3 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. 2020 వరకు అప్రతిహాతంగా ఆప్ ఢిల్లీని ఏలింది.
ఆ తర్వాత 2020 లో కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను చూపించింది. మొత్తం 62 స్థానాల్లో గెలిచి అధికారాన్ని మరోసారి కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకు మెరుగు పరుచుకుంది. ఢిల్లీలో రెండు పర్యాయాలుగా అధికారం చేపట్టిన ఆప్.. ఈ సారి ఓటమి తప్పదని ఎక్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే ఫలితాలలో ఇప్పటి వరకు బీజేపీ ముందంజలో ఉంది. దాదాపు బీజేపీ గెలుపు ఖాయమైనట్లు ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది.