లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ లారీ (భారీ కంటైనర్ ) బీభత్సం సృష్టించింది. మీరట్‌లో వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకూ లాక్కెళ్లింది. ఈ క్రమంలో లారీ మరికొన్ని వాహనాలను కూడా ఢీకొట్టింది.
కారులో ఉన్నవారితో పాటు అక్కడే ఉన్న స్థానికులు ఎంత అరిచినా మద్యం మత్తులో డ్రైవర్ వినిపించుకోలేదు. మరింత స్పీడ్ గా ట్రక్కును ముందుకు తీసుకెళ్లాడు. పోలీసులు వెంబడించడంతో నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.