
- తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా..
- ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా తెలిసిన ఘటన
పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లాలో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకి లారీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా తెలిసింది. సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్య తెలిపిన ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన లారీ డ్రైవర్ కె. జీవన్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం లోడుతో మరొక డ్రైవర్ తో కలిసి రాజమండ్రికి వెళ్తున్నాడు. అప్పటికే మద్యం తాగిన డ్రైవర్ స్పీడ్ గా నడుపుతుండగా మరో డ్రైవర్ భయంతో వైరాలో దిగిపోయాడు. మరొక క్లీనర్ ను ఎక్కించుకుని మరోసారి మద్యం తాగారు. మరింత వేగంగా వెళ్తుండడంతో క్లీనర్ కూడా భయపడి కల్లూరులో దిగిపోయాడు.
ఫుల్ గా తాగిన మత్తులో డ్రైవర్ జీవన్ కుమార్ యాక్సిడెంట్ చేయొచ్చని భావించిన క్లీనర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వీఎం బంజరు పోలీసులు అలర్టై స్టేషన్ ముందు నుంచి వెళ్తుండగా లారీని ఆపేందుకు యత్నించగా డ్రైవర్ వెళ్లిపోయాడు. పోలీసులు వెంబడించి పట్టుకుని డ్రైవర్ ను స్టేషన్ కు తీసుకెళ్లా రు. అతడి లైసెన్స్, ఆధార్ చెక్ చేస్తుండగా భయంతో డ్రైవర్ జీవన్ కుమార్ స్టేషన్ పైనుంచి దూకాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే పెనుబల్లి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతున్నాడు. పోలీసులు కొట్టడంతోనే దెబ్బలకు తట్టుకోలేక జీవన్ కుమార్ స్టేషన్ పై నుంచి దూకినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.