యాసిడ్ ట్యాంకర్, గ్యాస్‌ సిలిండర్ల లారీ ఢీ.. దట్టమైన పొగలు

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  తుని మండలం తేటగుంట వద్ద యాసిడ్ ట్యాంకర్‌ను గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తోన్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో ట్యాంకర్‌ నుంచి యాసిడ్‌ లీకై బయటకొచ్చింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దుర్వాసనతో కూడిన దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  మరోవైపు గ్యాస్ లారీలో డ్రైవర్ ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. గ్యాస్ లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.