ఔటర్​పై లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

 

  • ఔటర్​పై లారీ బీభత్సం.. ముగ్గురు మృతి
  • డివైడర్ ​దాటుకొని రెండు వెహికల్స్ ను ఢీకొట్టిన లారీ
  • ముగ్గురు మృతి.. ఇద్దరికి గాయాలు.. శామీర్​పేట వద్ద ఘోరం
  • ఈసీఐఎల్​లో మరో ప్రమాదం.. ఒకరు మృతి

శామీర్ పేట, వెలుగు: ఔటర్​ రింగ్ ​రోడ్(ఓఆర్ఆర్)​​పై ఓవర్ స్పీడ్​తో అదుపుతప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. డివైడర్​ను దాటుకొని వెళ్లి ఎదురుగా వచ్చే రెండు వెహికల్స్​ను ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సోమవారం శామీర్ పేట సమీపంలో ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌పై ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన వనమల్ల నర్సింహా(48), బీహార్​కు చెందిన క్లీనర్​  హమాలీ సుభాష్ పాశ్వాన్(27)తో కలిసి ఉదయం 7 గంటలకు బొలెరో వెహికల్​లో మేడ్చల్ వైపు వెళ్తున్నారు. 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్​కు చెందిన నల్లబోతుల వినయ్(22) లారీ డ్రైవ్ చేస్తూ మేడ్చల్ వైపు వస్తున్నాడు. ఓవర్ ​స్పీడ్​తో వెళ్తున్న లారీ శామీర్​పేట సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్​ను దాటుకొని వెళ్లి ఎదురుగా వస్తున్న నర్సింహాకు చెందిన బొలెరో వెహికల్​ను, మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ వినయ్, నర్సింహా, సుభాష్ పాశ్వాన్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో కారులో ఉన్న కరీంనగర్​కు చెందిన కిశోర్ రెడ్డి, నాగులు గాయపడ్డారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ:ఆ 12 మందిలో 11 మందికి .. టికెట్ కన్ఫామ్!

కారు డోర్​ తగిలి బైకర్​ మృతి

కుషాయిగూడ: నిర్లక్ష్యం.. ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన సోమవారం కుషాయిగూడలో చోటుచేసుకుంది. సైనిక్​పురికి చెందినసురేశ్(57) మొబైల్ రిపేర్ కోసం బైక్​పై ఈసీఐఎల్ వెళ్లారు. జగదీశ్ అనే వ్యక్తి ఈసీఐఎల్ సాయిబాబా దేవాలయం వద్ద మెయిన్​ రోడ్​పై కారు ఆపి సడెన్​గా డోర్ ఓపెన్​చేశాడు. వెనుక నుంచి బైక్​పై వస్తున్న సురేశ్​కు డోరు తగిలి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు తలకు తీవ్రగాయాలు కావడంతో సురేశ్ అప్పటికే మృతిచెందాడని తెలిపారు.