- ఇంట్లో ఉంటే దొంగల భయం
- ఆభరణాలు తీసుకెళ్తుండగా సీజ్
- బంగారు నగలను స్వాధీనం చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు
ఇబ్రహీంపట్నం, వెలుగు : దసరా సెలవులకు సొంతూరికి వెళ్తూ.. దొంగల భయంతో బంగారు ఆభరణాలను వెంట తీసుకెళ్తుండగా తనిఖీల్లో పోలీసులు పట్టుకుంటుండగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆదివారం సాయంత్రం శేరిగూడ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, వేర్వేరు కార్లలో 53 తులాల బంగారు ఆభరణాలను లభించగా స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు, కారణాలు చెప్పకుండా మంచాల మండలం ఆరుట్లకు చెందిన మద్దెల ఉదయ్ కుమార్, ఇబ్రహీంపట్నంలోని ఎంబీఆర్ నగర్ కు చెందిన ఆలూరి సంతోష్ కుమార్ నుంచి 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పండగకు సొంతూరు వెళ్తుండగా దొంగల భయంతో ఇంట్లోని ఆభరణాలను వెంట తీసుకెళ్తుండగా పోలీసులు సీజ్ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. బంగారంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించినట్టు ఇబ్రహీంపట్నం సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు.