జనగామ జిల్లాలో ప్రేమ వ్యవహారం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజుల తర్వాత ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదనే మనస్తాపంతో ప్రియురాలు కావేరి గత ఏడాది డిసెంబర్ 25న ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణానికి కారణమైన ప్రియుడు అరవింద్ ఇంటి ముందు ప్రియురాలి మృతదేహంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రియుడు అరవింద్ కూడా అదే నెల 26న పురుగుల మందు తాగాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం చనిపోయాడు.
అసలేం జరిగింది..?
వెంకిర్యాల గ్రామానికి చెందిన కావేరి, అరవింద్ గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని తమ బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. సీన్ కట్ చేస్తే ప్రియుడు పెళ్లికి నో అని చెప్పాడని, దీంతో కావేరి సూసైడ్ చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజులు తర్వాత చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందాడు. కన్నబిడ్డలు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.