‘డబుల్’ ఇండ్లు ఇవ్వాలంటూ ఆందోళన

‘డబుల్’ ఇండ్లు ఇవ్వాలంటూ ఆందోళన

‘డబుల్’ ఇండ్లు ఇవ్వాలంటూ ఆందోళన
బాసరలో బీజేపీ మహాధర్నా
భూపాలపల్లిలో ఆకునూరి మురళి పాదయాత్ర

భైంసా, వెలుగు : నిరుపేదలకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు మంజూరు చేయాలంటూ నిర్మల్​జిల్లా బాసరలో బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్​ మాట్లాడారు. ఎన్నికల టైంలో ఏది పడితే అది హామీలిచ్చుడు సీఎం కేసీఆర్​కు అలవాటైపోయిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఇండ్లు లేని పేదలకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి బీఆర్ఎస్​ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. బాసర మండలంలో ఏ ఒక్కరికీ డబుల్​బెడ్​రూమ్​ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. సొంత ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్​రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీకే పరిమితమయ్యారన్నారు. కనీసం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధిని కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మహాధర్నాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి దరఖాస్తుదారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భైంసా,-నిజామాబాద్​రహదారిపై బైఠాయించారు. అనంతం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. 

400 మంది మహిళలతో పాదయాత్ర

భూపాలపల్లి అర్బన్ : భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు కేటాయించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారం రోజులుగా భూపాలపల్లి కలెక్టరేట్ ఎదురుగా మహిళలు ఆందోళన చేస్తున్నారు. గురువారం రాత్రి పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలను చెదరగొట్టారు. విషయం తెలిసి ఆకునూరి మురళి శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్​పరిధిలోని అన్ని వార్డులకు చెందిన సుమారు 400 మంది మహిళలతో సుమారు 5 కిలోమీటర్లు పాదయాత్రగా కలెక్టరేట్​కు చేరుకున్నారు. బాధిత మహిళల అభిప్రాయ సేకరణ చేపట్టి సుమారు 280 ఫిర్యాదులతో కూడిన పత్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్​ మిశ్రాకు అందజేశారు. అనంతరం మురళి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర  ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 24 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇప్పటివరకు కనీసం 40 శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలలోపు ఇండ్లను పూర్తిచేసి పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.