
కర్నూలు: శ్రీశైలం -దోర్నాల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి బెంగళూరు వెళ్తున్న KSRTC బస్ ప్రమాదవశాత్తూ గుంతలోకి వెళ్లింది. వర్షం కారణంగా ముందు కనపడక పోవటంతో అదుపు తప్పి KSRTC బస్సు గుంతలోనికి వెళ్ళడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
సేఫ్టీ రాట్స్ ఉండడంతో బస్సు ముందుకెళ్లకుండా ఆగింది. దీంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలంలో ఇలా ఉంటే.. తిరుమల ఘాట్‌రోడ్లపై జరుగుతున్న వరుస ప్రమాదాలు కూడా భక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
తిరుమల ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ( ఏప్రిల్19) సమయంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టెంపో ట్రావెలర్ బ్రేక్‌ఫెయిల్ అయి అదుపు తప్పింది. ఈ ఘటనలో టెంపో చెట్టును ఢీకొట్టడంతో పది మందికి గాయాలయ్యాయి.
ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆదివారం ( ఏప్రిల్ 20) ఉదయం తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో కారు దగ్ధమైంది. ఇక.. మరో ప్రమాదంలో ఘాట్‌రోడ్డులో అదుపు తప్పిన కారు రక్షణ గోడను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఇలా తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో తిరుమల వెంకన్న దర్శనానికి వస్తున్న భక్తుల్లో ఆందోళన నెలకొంది.