- రూ.50 లక్షల ఆస్తి నష్టం
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణం జీపు అడ్డా ప్రాంతంలోని ఓ రెడీమేడ్ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపు యజమాని సుతారీ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి రోజు లాగానే ఓనర్ దుకాణాన్ని బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి ఆ దుకాణంలోని నుంచి పొగలు రావడంతో రోడ్డు పక్కనున్నవారు గమనించి యజమానికి సమాచారం ఇచ్చారు.
ఆయన వచ్చి దుకాణాన్ని తెరవగా అప్పటికే పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే దుకాణంలోని ఖరీదైన ఫర్నీచర్ తో పాటు బట్టలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు రాజేందర్ వాపోయాడు. ఎస్ఐ రాహుల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.