- అందుబాటులో లేనిమెడికల్ ఆఫీసర్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో ఘటన
చండ్రుగొండ, వెలుగు : నార్మల్ డెలివరీ అవుతుండగా ఊపిరాడక మగశిశువు చనిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పీహెచ్ సీలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెండాలపాడు గ్రామానికి చెందిన పద్దం లావణ్య డెలివరీ కోసం ఆశా కార్యకర్త సహాయంతో ఆదివారం సాయంత్రం చండ్రుగొండ పీహెచ్ సీకి చేరుకొంది. సోమవారం ఉదయం నొప్పులు రావడంతో స్టాఫ్ నర్సులు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో మెడికల్ ఆఫీసర్ తనూజ అందుబాటులో లేరు. శిశువు ముక్కు భాగం వరకు బయటకు వచ్చేసరికి నొప్పులు ఆగిపోయాయి. వైద్య సిబ్బంది శిశువును బయటకు లాగగా అప్పటికే ఆ శిశువు మృతి చెందింది.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిశువు చనిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెడికల్ ఆఫీసర్ తనూజ.. పీహెచ్ సీకి చేరుకున్నారు. పరిస్థితి సద్దమణిగించి బాధితురాలు లావణ్యను 108లో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త ప్రవీణ్ మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్ స్థానికంగా ఉండకపోవడం వల్లే శిశువు చనిపోయిందన్నారు. ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ ని వివరణ కోరగా డెలివరీకి ముందు స్కానింగ్ రిపోర్టులన్ని సాధారణంగా ఉన్నాయన్నారు. సడన్ గా నొప్పులు రావడంతో నార్మల్ డెలివరి అవుతుందని ఊహించామని చెప్పారు. నొప్పులు ఆగిపోవడంతో శిశువు పూర్తిగా బయటకు రాకుండానే ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. వందలో ఒక కేసు మాత్రమే ఇలా జరుగుతుందన్నారు.