ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపి.. రూ.3కోట్లతో పరార్

అలంపూర్, వెలుగు:  గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో  అధిక వడ్డీ పేరుతో  జనాల నుంచి రూ.3  కోట్లు వసూలు చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు.  గురువారం స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..   గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వివిధ ఇన్సూరెన్స్  కంపెనీల్లో పాలసీలు చేయిస్తూ ఉండేవాడు.  అధిక వడ్డీ పేరుతో పుల్లూరు, పంచాలింగాల, నిర్జూరు, కర్నూలు, మానవపాడు గ్రామాల్లో రూ.లక్షకు  నెలకు రూ.5 వేల నుంచి రూ.7,500 వరకు వడ్డీ ఇస్తానని చెప్పి ఎలాంటి బాండ్ పేపర్లు లేకుండా ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు డిపాజిట్  చేయించాడు. 

 నెలసరి వడ్డీ చెల్లిస్తుండడంతో  ఏ కంపెనీలో డబ్బులు డిపాజిట్  చేస్తున్నారని  ఏ  ఒక్కరూ అడగలేదు.  డిపాజిట్  చేసిన వారికి, చేయిస్తున్న మధ్యవర్తులకు గోవా, బ్యాంకాక్  ట్రిప్​లు, కమీషన్లు, పార్టీలు ఇస్తూ లగ్జరీగా ఎంజాయ్  చేయించేవాడు. అధిక వడ్డీ చెల్లిస్తుండడంతో వివిధ గ్రామాల ప్రజలు,  వారి బంధువులతో  లక్షల్లో డిపాజిట్ చేయించారు.  3 నెలల నుంచి వడ్డీ  చెల్లించకపోవడంతో గ్రామంలోని ఇంటికి వచ్చి అడగ్గా  రేపు మాపంటూ కాలయాపన చేశాడు.  

డబ్బులు చెల్లించాలంటూ బాధితులు వరుస కడుతుండడంతో రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. విషయం బయటకు రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.  ఈ విషయంపై ఉండవెల్లి ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు  అందలేదని తెలిపారు.