లఖీంపుర్: ఉత్తరప్రదేశ్లోని లఖీంపుర్ ఖీరీ జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలపై రీల్స్ చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబంలో పెను విషాదం నింపింది. మహ్మద్ అహ్మద్ (26), అతని భార్య నజ్రీన్ (24), రెండేళ్ల కొడుకు అబ్దుల్లా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కుటుంబం స్వస్థలం సీతాపూర్ జిల్లా లహర్పూర్ పట్టణం అని పోలీసులు తెలిపారు. హర్గావ్ సమీపంలోని ఒక గ్రామంలో ఫంక్షన్కు హాజరైన ఈ కుటుంబం సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు.
ఇన్స్టాగ్రాంలో రీల్స్ చేస్తుండగా అదే పట్టాలపై ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. రైలు వస్తున్న విషయం గమనించకపోవడంతో ఈ ముగ్గురి మీద నుంచి రైలు తొక్కుకుంటూ పోయింది. ఘటనా స్థలంలోనే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. రైలు పట్టాల దగ్గరలో ఈ కుటుంబం పార్క్ చేసిన బైక్ కనిపించింది. రైలు పట్టాలపై 50 మీటర్ల దూరం ఈ కుటుంబం నడుచుకుంటూ వెళ్లి రైల్వే బ్రిడ్జి దగ్గర ఆగి రీల్స్ చేసినట్లు తెలిసింది. లక్నో నుంచి మైలానికి వెళుతున్న ప్యాసింజర్ ట్రైన్ వీరిని ఢీ కొట్టింది. మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించారు.