
కొత్తపల్లి, వెలుగు : ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పినా వినకపోవడంతో ఓ వ్యక్తి తన కొడుకు రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో శుక్రవారం జరిగింది. కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన పెరుమాండ్ల జ్యోతి, -శ్రీనివాస్ దంపతుల కొడుకు శివసాయి (21) హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడ్డాడు. ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో బుధవారం గ్రామానికి వచ్చిన శివసాయి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతూనే ఉన్నాడు.
గమనించిన తండ్రి మందలించాడు. ఫంక్షన్ ముగియడంతో హైదరాబాద్ వెళ్తానని శివసాయి పట్టుబట్టాడు. దీంతో గ్రామంలోనే ఉండాలని, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడడం మానివేయాలని తండ్రి శ్రీనివాస్ చెప్పడంతో తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. పైగా తండ్రి పేరిట ఉన్న భూమిని అమ్మాలని శివసాయి ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైంలో కొడుకు కండ్లలో కారంపొడి చల్లి, రోకలి బండతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శివసాయి స్పాట్‌లోనే చనిపోయాడు. శ్రీనివాస్ కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాంబమూర్తి చెప్పారు.