న్యూఢిల్లీ : అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
టిగ్రీ ప్రాంతంలోని సంగం విహార్‌కు చెందిన 21 ఏళ్ల యూసఫ్ అలీ, షారుఖ్ అనే వ్యక్తి నుంచి ఈ మధ్య రూ.3 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నాలుగు రోజుల కిందట యూసఫ్‌ను షారుఖ్ బెదిరించాడు. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్టు 2న) ఉదయం ఒక షాపు వద్ద ఉన్న యూసఫ్ అలీపై కత్తితో దాడి చేశాడు షారుఖ్. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన యూసఫ్ పై చాలాసార్లు కత్తితో పొడిచాడు. దీంతో అలీ రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.
యూసఫ్ ను కత్తితో పొడుస్తున్న సమయంలో ఘటనాస్థలంలో చాలామంది ఉన్నారు. ఎవరూ కూడా ముందుకు వచ్చి షారుఖ్ ను అడ్డుకోలేదు. పైగా సినిమా చూస్తున్నట్లు చూశారు. యూసఫ్ అలీ రక్తపు మడుగులో కుప్పకూలిన తర్వాత.. ఎట్టకేలకు నిందితుడు షారుఖ్‌ను కొంతమంది ధైర్యం చేసి పట్టుకున్నారు.
ఈ విషయం గురించి తెలియగానే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన యూసఫ్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.