- కట్టెలతో కొట్టిన దాయాదులు
- తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ మృతి
- నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో ఘటన.. గ్రామంలో పోలీస్ పికెట్
- ఘటనపై సీఎం సీరియస్..బాధ్యులపై చర్యలకు ఆదేశం
ఊట్కూర్, వెలుగు : భూతగాదాలకు ఓ వ్యక్తి బలయ్యాడు. దాయాదులు అతణ్ని కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో, తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు. ఈయనకు మొదట బాలమ్మతో వివాహం జరగ్గా, వాళ్లకు సంజప్ప అనే కుమారుడు ఉన్నాడు. అయితే వివాహమైన తర్వాత కొన్నేండ్లకు బాలమ్మ చనిపోవడంతో తిప్పమ్మ అనే మహిళను లక్ష్మప్ప రెండో పెండ్లి చేసుకున్నాడు.
వీళ్లకు పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప అనే కొడుకులు ఉన్నారు. లక్ష్మప్పకు గ్రామ శివారులో 9 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని 20 ఏండ్ల కిందట ఆయన చనిపోవడానికి ముందే ముగ్గురు కొడుకులకు సమానంగా పంచాడు. అయితే ఐదేండ్ల కింద పెద్ద భార్య కుమారుడు (సంజప్ప), చిన్న భార్య కుమారుల (పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప) మధ్య భూమి విషయంలో గొడవ మొదలైంది. దీనిపై 2023లో చిన్న భార్య కుమారులు పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేయడంతో పాటు కోర్టులో కేసు వేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరి పనులు వారు చేసుకోవాలని పోలీసులు సూచించారు.
పొలం పనులు చేస్తుండగా దాడి..
పెద్ద సవారప్ప, ఆయన కుమారుడు సంజీవ్ తో పాటు చిన్న సవారప్ప, ఆయన భార్య కవిత గురువారం పొలం దున్నేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సంజప్ప కొడుకులు గుట్టప్ప, ఆటో సంజీవ్ పొలం వద్దకు వెళ్లారు. వాళ్ల వెంట ఆశప్ప, చిన్న వెంకటప్ప, శీను, కిష్టప్ప, నట్టలప్పను తీసుకెళ్లి గొడవకు దిగారు. 2 వర్గాల మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో పెద్ద సవారప్ప కుమారుడు సంజీవ్(28)పై దాయాదులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
అడ్డుకోబోయిన కవితపైనా దాడి చేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డికి సమాచారం ఇవ్వగా, తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను గ్రామంలోకి తీసుకొచ్చారు. గంటయ్యాక వచ్చిన పోలీసులు.. అంబులెన్స్‌లో అతడిని నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంజీవ్ మృతి చెందాడు. గుట్టప్ప, ఆటో సంజీవ్, ఆశప్ప, చిన్న వెంకటప్ప, శీను, కిష్టప్ప, నట్టలప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఆశప్ప, శీను, ఆటో సంజీవ్, కిష్టప్పను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్ సీరియస్..
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్సై సస్పెన్షన్..
డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఊట్కూరు ఎస్సై బి.శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ మల్టీజోన్2 ఐజీ సుధీర్‌బాబు ఉత్తర్వులిచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఎస్పీ యోగేశ్ గౌతమ్ హెచ్చరించారు. కాగా, సంజీవ్ మృతికి కారణమైనోళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ లింగయ్య అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వాళ్లను ఎస్పీతో ఫోన్లో మాట్లాడించడంతో వారు ఆందోళనను విరమించారు.