భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త సూసైడ్‌‌‌‌‌‌‌‌

బోథ్, వెలుగు : భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా బోథ్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం జరిగింది. మండల కేంద్రంలోని భగత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ కాలనీకి చెందిన కాలేరి శేఖర్‌‌‌‌‌‌‌‌ (34)కు నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన సోనితో 2022లో వివాహమైంది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

విషయం తెలుసుకున్న సోని తల్లిదండ్రులు గ్రామానికి చెందిన నిఖిల్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తికి ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి తమ కుమార్తెను పుట్టింటికి తీసుకురావాలని కోరారు. నిఖిల్‌‌‌‌‌‌‌‌తో పాటు శేఖర్‌‌‌‌‌‌‌‌ తండ్రి సంతోష్‌‌‌‌‌‌‌‌ కలిసి సోనిని మూడు రోజుల కింద పుట్టింట్లో దింపి వచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన శేఖర్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొద్దిసేపటి తర్వాత మృతుడు తల్లి నిర్మల గమనించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి సంతోష్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.