ప్రాణం తీసిన ఒక్క రూపాయి గొడవ

  •     బిర్యానీ కొన్నాక ఒక రూపాయి ఎక్కువ పే చేసిన ఆటో డ్రైవర్‌‌‌‌
  •     ఎగతాళి చేసిన యువకుడు, ఇద్దరి మధ్య గొడవ
  •     తోపులాటలో కిందపడి తలకు రాయి తగలడంతో ఆటో డ్రైవర్‌‌‌‌ మృతి

కాశీబుగ్గ, వెలుగు : ఒక్క రూపాయి విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన వరంగల్‌‌‌‌ మిల్స్‌‌‌‌ కాలనీ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలోని లేబర్‌‌‌‌ కాలనీలో శనివారం జరిగింది. వరంగల్‌‌‌‌ నగరంలోని గాంధీనగర్‌‌‌‌కు చెందిన ఈసెంపెల్లి ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ (42) ఆటో నడుపుతూ జీవిస్తుంటాడు. శుక్రవారం రాత్రి లేబర్‌‌‌‌ కాలనీలోని ఓ బిర్యానీ పాయింట్‌‌‌‌ వద్దకు వచ్చాడు. అదే సమయంలో బిర్యానీ కోసం జన్ను అరవింద్‌‌‌‌ అనే యువకుడు సైతం అక్కడికి వచ్చాడు.

బిర్యానీ రూ. 59 అయితే ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ ఫోన్‌‌‌‌ పే ద్వారా రూ. 60 చెల్లించాడు. దీంతో ఒక రూపాయి ఎక్కువ చెల్లించావంటూ అరవింద్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ను ఎగతాళి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. గొడవ పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అరవింద్ ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ను బలంగా నెట్టేయడంతో అతడు కింద పడ్డాడు.

పక్కనే ఉన్న రాయి తలకు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కానీ ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అరవింద్‌‌‌‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.