పోలీస్‌‌ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి

పోలీస్‌‌ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి
  • ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో జీజీహెచ్‌‌లో చేర్చిన పోలీసులు, వెంటనే మృతి
  • పోలీస్‌‌ దెబ్బలు తాళలేకే చనిపోయాడంటూ కుటుంబసభ్యుల ఆందోళన
  •  హార్ట్‌‌ అటాక్‌‌తో చనిపోయాడన్న సీపీ

​నిజామాబాద్, వెలుగు : పోలీస్‌‌ కస్టడీలో ఉన్న గల్ఫ్‌‌ ఏజెన్సీ నిర్వాహకుడు శుక్రవారం నిజామాబాద్‌‌ సర్కార్‌‌ హాస్పిటల్‌‌లో చనిపోయాడు. అయితే పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేకే చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఆలకుంట సంపత్‌‌ (32) జగిత్యాలలో శ్రీరామ ఇంటర్నేషనల్‌‌ మ్యాన్‌‌పవర్‌‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ యువకులను థాయ్‌‌లాండ్‌‌, మయన్మార్, లావోస్‌‌ వంటి దేశాలకు పంపుతుంటాడు. 

అక్కడికి వెళ్లిన యువకులకు పని దొరకకపోగా సైబర్‌‌ నేరాలు చేసే వారి చెరలో చిక్కుతున్నారు. ఇలా నిజామాబాద్‌‌కు చెందిన పలువురు మోసపోవడంతో తిరిగి గ్రామానికి వచ్చి పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలకుంట సంపత్‌‌తో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌కు తరలించారు. 

కోర్టు పర్మిషన్‌‌తో ఈ నెల 12న కస్టడీకి తీసుకొని విచారించారు. గురువారం ఉదయం జగిత్యాలలోని సంపత్‌‌ ఆఫీస్‌‌కు తీసుకెళ్లి విచారించిన అనంతరం రాత్రి తిరిగి తీసుకొచ్చారు. ఇంతలో తనకు ఛాతిలో నొప్పి వస్తుందని సంపత్‌‌ పోలీసులకు చెప్పడంతో అతడిని జీజీహెచ్‌‌లో చేర్పించారు. అక్కడ చేరిన కొద్దిసేపటికే సంపత్‌‌ 
చనిపోయాడు. 

ఆందోళనకు దిగిన బంధువులు

పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేకే సంపత్‌‌ చనిపోయాడని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగారు. హాస్పిటల్‌‌ ఎదుట మెయిన్‌‌ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంపత్‌‌ను రెండు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి, గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జగిత్యాలకు తీసుకెళ్లారన్నారు. 

ఐదు గంటలకు రిటర్న్ అయిన వారు రాత్రి 7 గంటల వరకే ఇందూరుకు చేరుకోవాలని, కానీ 10 గంటల వరకు ఎక్కడికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. సంపత్‌‌ చనిపోయాక అర్ధరాత్రి ఒంటి గంట టైంలో రెండో వ్యక్తిని వదిలేశారని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఏసీపీ రాజావెంకట్‌‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. 

హార్ట్‌‌ అటాక్‌‌తోనే చనిపోయాడు : సీపీ

సంపత్‌‌ యువకులకు ప్రలోభాలు పెట్టి ఇతర దేశాలకు పంపేవాడని సీపీ సాయి చైతన్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జగిత్యాలలోని అతడి ఆఫీస్‌‌లో దాచిన ఫోన్లు స్వాధీనం చేసుకొని తిరిగి వచ్చాక, ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో జీజీహెచ్‌‌లో చేర్పించామన్నారు. అతడు నడుచుకుంటూ హాస్పిటల్‌‌కు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో ఉందన్నారు. సంపత్‌‌ హార్ట్​అటాక్‌‌తోనే చనిపోయాడని, అతడిని బతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. సంపత్‌‌పై నమోదైన కేసులపై పారదర్శకంగా దర్యాప్తు చేశామని పేర్కొన్నారు.