- సింగరేణి సైలో బంకర్ కాలుష్యమే కారణమని సెల్ఫీ వీడియో
సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన బుర్ర తుకారాం అలియాస్ రవీంద్ర (38) అనారోగ్యంతో చనిపోయాడు. తన అనారోగ్యానికి సింగరేణికి సంబంధించిన సైలో బంకర్ నుంచి వెలుడే దుమ్మే కారణమని ఇటీవల అతడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్లే... తుకారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వారం కింద హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ట్రీట్‌మెంట్ అనంతరం ఇటీవల గ్రామానికి వచ్చాడు.
గురువారం రాత్రి మరోసారి ఇబ్బంది ఏర్పడడంతో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. అక్కడ ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ చనిపోయాడు. అయితే హైదరాబాద్ వెళ్లడానికి ముందు ‘నా అనారోగ్యానికి కాలనీ సమీపంలోని సింగరేణికి సంబంధించిన సైల్ బంకర్ నుంచి వచ్చే దుమ్మే కారణం, బంకర్‌ను తొలగించి మా కాలనీవాసులను కాపాడాలి’ అంటూ అతడు తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో బంకర్ విషయంలో సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చి, తర్వాత పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు డెడ్‌బాడీతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.