ఐపీఎల్ వస్తుందంటే చాలు ఎక్కువమంది బెట్టింగ్లు పెట్టేందుకు అసక్తి చూపిస్తుంటారు. ఈ బెట్టింగ్లు అందరికి కలిసి రావు.. కొందరు కలిసోచ్చి ధనవంతులు అవుతుంటే మరికొందరు అప్పులపాలు అవుతున్నారు. తాజాగా ఐపీఎల్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ డిగ్రీ స్టూడెంట్ అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఆత్మహత్యనే నమ్ముకున్నాడు.
ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దిబ్బపాలెం గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు, జయల కుమారుడు మధుకుమార్ (20) . ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతోన్న మధుకుమార్ ... ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కోసం తన గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. అయితే బెట్టింగ్ లో పెట్టిన డబ్బులు పోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.
ఒకపక్క డబ్బులు పోగొట్టుకున్న బాధ, మరోపక్కఅప్పు తీర్చమనే ఒత్తిడి రావడంతో మధుకుమార్ ఏప్రిల్ 23న రాత్రి ఎలుకల మందు తాగాడు. అయితే ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఏప్రిల్ 25 మంగళవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి తల్లి మధుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.