వైరా, వెలుగు : ప్రేమ పేరుతో ఒక వ్యక్తి ఓ మహిళ నుంచి రూ.6 లక్షలు కాజేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి లక్ష్మీపురం గ్రామానికి చెందిన రామోజీ ఉప్పలాచారి వైరాలోని కూరగాయల మార్కెట్ బజారులో యూపీఎస్పీ సాఫ్ట్వేరు కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు.
కోచింగ్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఏడాది కిందట వైరాలోని అతడి సెంటర్కు వచ్చింది. అప్పటికే ఆమె భర్త చనిపోయాడు. ఇదే అదునుగా భావించిన ఉప్పలాచారి ఆమెను ప్రేమ పేరుతో నమ్మించాడు.
ఆమె నుంచి సుమారు రూ.6 లక్షల నగదును తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఇటీవల అతడిపై ఆమె ఒత్తిడి పెంచడంతో ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు చారిపై వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.