వంతెన దాటుతూ వాగులో పడిపోయాడు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. జల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు నీట మునగటంతోపాటు.. గ్రామాల మధ్య రహదారులు అన్నీ నీటి ప్రవాహాన్ని తలపిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. కొంత మంది అత్యుత్సాహంగా.. ఏమీ కాదులే అన్నట్లు తెగించేసి దాటేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే చేసి ఓ వ్యక్తి వాగులో పడిపోయి తృటిలో ప్రాణలు దక్కించుకున్నాడు.  

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం  మోర్ఖండి వద్ద నిర్మించిన లో లెవల్ వంతెనపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే దానిపై  ఉప్పర్పల్లి కి చెందిన దుర్వ రాందాస్ అనే వ్యక్తి వంతెనను దాటేందుకు ప్రయత్నిస్తుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అయితే కొద్ది దూరంలో చెట్టు ఉండడంతో ఆ చెట్టు సహాయంతో బతికి బయట పడ్డాడు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.