ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన ధర్మేంద్ర శుక్లా కొవిడ్19 టైంలో మెడిసన్స్, పరికరాలు, మెటీరియల్సరఫరాలకు సంబంధించిన టెండర్లు, వాటి బిల్లుల చెల్లింపు వివరాల్ని కోరుతూ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌కు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు.
నెల రోజులైనా అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో శుక్లా అప్పిలేట్ ఆఫీసర్ శరద్గుప్తాను ఆశ్రయించారు. ఆయన అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని గుప్తా అధికారులను ఆదేశించారు. ఏకంగా 40 వేల పేజీల సమాచారాన్ని దరఖాస్తుదారుడికి ఇచ్చారు. వాటిని తీసుకెళ్లడానికి శుక్లా ఓ కారును ఉపయోగించాల్సి వచ్చింది.
ప్రభుత్వ ఖజానాపై భారం..
సాధారణంగా ఆర్టీఐ కింద ఇచ్చే సమాధానం నెల రోజుల లోపు ఉంటే ప్రతి పేజీకి దరఖాస్తుదారుడే రూ.2 చొప్పున చెల్లించాలి. నెలలోపు ఇవ్వకపోతే ఆ ఖర్చు మొత్తాన్ని సంబంధిత విభాగమే భరించాలి. దీంతో శుక్లాకు ఆ సమాచారం ఇవ్వడానికి ఖజానాపై పేపర్ ప్రింటింగ్ రూపంలో రూ.80 వేల భారం పడటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడం కొసమెరుపు.