టోక్యో: జపాన్ కు చెందిన ఓ వ్యక్తి తన స్ట్రెస్ రిలీఫ్ కోసం విచిత్రమైన మార్గాన్ని అనుసరిస్తున్నాడు. ఎవరో తెలియనివాళ్ల ఇండ్లల్లోకి గుట్టుచప్పుడు కాకుండా చొరబడి హల్ చల్ చేస్తున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1000 ఇండ్లల్లోకి చొరబడ్డాడు. కొందరు బాధితుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు చెప్పిన మాటలు విని షాకయ్యారు. " నేను కొద్దికాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నాను. స్ట్రెస్ తగ్గించుకునేందుకు ఇతరుల ఇండ్లల్లోకి చొరబడటం హాబీగా పెట్టుకున్నాను.
ఇప్పటిదాకా నేను 1,000 కంటే ఎక్కువ సార్లు ఇతరుల ఇండ్లల్లోకి చొరబడ్డాను. ఇంట్లో వాళ్లు నన్ను కనుక్కుంటారా ? లేదా? అని ఆలోచించినప్పుడు నా అరచేతులు చెమటలు పట్టేవి. దానికి నేను చాలా థ్రిల్ అయ్యాను. దాంతో నాకు కొంత ఒత్తిడి తగ్గుతుంది" అని నిందితుడు పేర్కొన్నాడు. అయితే, నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. అతడిని చికిత్స కోసం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని.. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.