హైదరాబాద్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది బతుకుదెరువు కోసం వస్తుంటారు. అలా వచ్చిన వాళ్లలో కొంతమందికి పని దొరికితే.. మరికొంతమందికి పని దొరొక్క పోగా.. ఒక్కపూట భోజనం కూడా లేకుండాపోతోంది. అలా అన్నం దొరక్క ఆకలితో అలమటించేవాళ్లు చాలామందే ఉంటారు. కళ్ల ముందే ఆకలి అంటూ కేకలు వేసినా పట్టించుకునేవాళ్లు కూడా ఉండరు. ఇలాంటివారిని చూసి కొందరు మాత్రం స్పందిస్తారు. ఎలాంటి స్వార్ధం లేకుండా... ఏమీ ఆశించకుండా అలాంటివారికి బుక్కెడు బువ్వ పెట్టే వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇలా ఆకలితో ఉన్న వాళ్ల కడుపునింపుతూ నిస్వార్థంగా సేవ చేస్తున్న కుటుంబాలలో ఒకటి సురేష్ మంగళ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గత రెండేళ్ల నుంచి ఆకలితో అలమటించే పేద ప్రజలకు ‘అన్నపూర్ణ’ కార్యక్రమం ద్వారా ఉచిత మీల్స్ అందిస్తోంది.
అల్వాల్‌లోని పంచశీల కాలోనిలోని హై టెన్షన్ రోడ్.. మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వందల మంది పోగైతరు. కొందరైతే గంట ముందే అక్కడ చేరుకుని ఎదురు చూస్తుంటారు. వారిలో చాలామంది పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి.. బతుకు వెళ్లదీస్తున్న పేదలే ఎక్కువగా కనిపిస్తారు. అక్కడకు ఓ వృద్దుడు వర్కర్లతో కలిసి వస్తుంటే.. వారందరి ముఖాల్లో వెలుగు కనిపిస్తది. ఆ ముఖాల్లో వెలుగులకు కారణమైన వ్యక్తే సురేష్ మంగళ్.
సురేష్ మంగళ్ స్వస్థలం హర్యాన. ఈయన వ్యాపారం నిమిత్తం 1994లో సికింద్రాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. అల్వాల్ పంచశీల కాలనీలో కుటుంబంతో సహా నివాసముంటున్నాడు. సురేష్ మంగళ్‌కు ముగ్గురు కొడుకులు. వీరిలో ఒకరు అమెరికాలో ఉంటుండగా.. మిగతా ఇద్దరు హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తున్నారు. కాగా.. ఒక్క పూట తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తున్న వాళ్లను ఎంతో మందిని చూసిన సురేష్.. అన్నదానం చేయడమే సరైన సేవా అని భావించారు. అయితే తాము సంపాదించే దాంట్లో కొంతభాగంతో పేదలకు సహాయం చేయలని సురేష్ మంగళ్ అనుకున్నాడు. తనకు వచ్చిన ఈ ఆలోచనను ఫ్యామిలీతో పంచుకున్నాడు. వాళ్లు కూడా ఓకే చెప్పడంతో ‘అన్నపూర్ణ భోజనం’ పేరుతో ఫ్రీ మీల్స్ ప్రోగ్రాంను మొదలు పెట్టారు.
ఈ ప్రోగ్రాం ద్వారా సురేష్ మంగళ్ గత రెండేళ్ల నుంచి తన ఇంటికి దగ్గర్లో, రోడ్డు పక్కనే ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం పెడుతున్నాడు. అయితే ఉచితంగా భోజనం పెడితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదని భావించిన ఆయన.. 60 ఏళ్లు, ఆపైబడిన వృద్దులకు ఉచితంగా బోజనం పెడుతూ.. మిగతా వారి నుంచి కేవలం 5 రూపాయలు మాత్రం తీసుకుని కడుపునిండా భోజనం వడ్డిస్తారు. ఒక్కరోజు అన్నదానం చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోరుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ సురేష్ మంగళ్ మాత్రం.. తన అన్నదానం గురించి ఎక్కడా పబ్లిసిటీ చేసుకోలేదు. పైగా దీనికోసం ఎవరి నుంచి విరాళాలు కూడా సేకరించడు.. ఒకవేళ ఎవరైనా ఇచ్చినా తీసుకోడు. కాకపోతే.. ఈ అన్నదానానికి ఉపయోగపడే బియ్యం, కూరగాయలు ఇస్తే మాత్రం సంతోషంగా స్వీకరిస్తానంటున్నాడు. పైగా.. తనకు, తన కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తున్న ఈ కార్యక్రమాన్ని జీవితాంతం కొనసాగిస్తానని కూడా సురేష్ అంటున్నాడు. అంతేకాకుండా.. భవిష్యత్తులో తాండాలకు కూడా వెళ్లి గిరిజన బిడ్డల ఆకలి తీరుస్తానంటున్నాడు.
అయితే ఉచిత భోజనమే కాకుండా... గివ్ ఆర్ టేక్ పాలసీని కూడా సురేష్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంట్లో ఉపయోగించి వృధాగా పడి ఉన్న వస్తువులను కూడా తీసుకుంటున్నాడు. ఆ వస్తువులను ఎవరికి అవసరమో వారికి ఇస్తుంటాడు. అందుకోసం ముగ్గురు ఉద్యోగులను కూడా నియమించారు. అల్వాల్ ప్రాంతంలో రోడ్డు మీదుగా వెళ్తుంటే.. గోడలపై గివ్ ఆర్ టేక్ అనే బోర్డులు వెల్కమ్ చెబుతాయి.
శ్రీకృష్ణా పూర్ణి దేవి మంగళ్ ట్రస్ట్ ఆద్వర్యంలో అన్నపూర్ణ భోజనం పేరుతో సురేష్ మంగళ్ చేస్తున్న సేవలపై చుట్టుపక్కల కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆకలవుతుంది.. పది రూపాయలియ్యండి అన్నం తింటామని నోరు తెరిచి అడిగినా రూపాయి కూడా ఇవ్వని ఈ రోజుల్లో.. ఇలాంటి వారు పేద ప్రజల కోసం సేవ చేయడం అభినందనీయమంటున్నారు.
కాలనీ చుట్టు పక్కల ఎక్కడ పని చేస్తున్నాసరే మధ్యాహ్నం అయ్యేసరికి ఇక్కడికి చేరుకుంటామని ఆ ప్రాంత పేద ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ ఆద్వర్యంలో 5 రూపాయల మీల్స్ నడుస్తుందని.. దాని కన్నా ఈ భోజనం వంద రెట్లు బెటర్‌గా ఉందంటున్నారు. ఒక్కోసారి ఇంట్లో కూడా వేడిగా ఆహారం ఉండదని.. కానీ సురేష్ మంగళ్ పెట్టే భోజనం మాత్రం ఎప్పుడూ వేడివేడిగా ఉంటుందని అంటున్నారు. భోజనంతో పాటు అరటి పండు లేదా ఏదో ఒక స్వీటు కూడా ఇస్తున్నారని భోజనం చేసిన వాళ్లు చెబుతున్నారు. ఏదేమైనా.. సురేష్ మంగళ్ చేస్తున్న సేవ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తొంది. ఇలాంటి మంచి హృదయంతో పేదలకు సేవ చేసేందుకు మరింత మంది మందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
For More News..
కరోనా దెబ్బకు చిరిగిన వెడ్డింగ్ కార్డ్స్ బిజినెస్
హుజూరాబాద్ లో డబ్బుల పంపిణీ లొల్లి