దళితబంధు రాలేదని..  పినాయిల్​ తాగిండు 

దళితబంధు రాలేదని..  పినాయిల్​ తాగిండు 
  • సీఎం సభకు వెళ్లే  బస్సు ముందు బైఠాయింపు 
  • పక్కకు తప్పించి వెళ్లిపోయిన బీఆర్ఎస్​ కార్యకర్తలు 
  • దవాఖానకు తరలించిన పోలీసులు

టేక్మాల్, వెలుగు : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజిపల్లిలో తనకు దళితబంధు స్కీమ్ మంజూరు కాలేదని బేగరి దేవయ్య అనే యువకుడు పినాయిల్​తాగి హల్​చల్ ​చేశాడు. మెదక్​లో బుధవారం జరిగిన సీఎం కేసీఆర్ మీటింగ్​కు సాలోజిపల్లి నుంచి బస్సు బయలుదేరింది. అందులో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడంతో దాని ముందు కూర్చుని తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంతకుముందు గ్రామ సేవక్​గా పని చేశానని, ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా లేదని తన పరిస్థితి అగమ్యగచరంగా మారిందనన్నాడు. కొద్దిసేపు చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు తర్వాత అతడిని బస్సు ముందు నుంచి పక్కకు తప్పించి మీటింగ్​కు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న టేక్మాల్ పోలీసులు అక్కడికి వచ్చి దేవయ్యను జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు.