ఒకే ఇంట్లో 30 కరెంట్ మీటర్లు.. రెండేండ్లుగా బిల్లులూ కడుతున్నడు.. ఎందుకని అడగ్గా..

ఒకే ఇంట్లో 30 కరెంట్ మీటర్లు.. రెండేండ్లుగా బిల్లులూ కడుతున్నడు.. ఎందుకని అడగ్గా..
  • ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వాటి సాయంతో రెగ్యులరైజేషన్ చేసుకునేందుకే..
  • మీటర్లు స్వాధీనం.. నిందితుడు అరెస్ట్
  • స్థానిక అధికారులు, సిబ్బంది చేతివాటం

దుండిగల్, వెలుగు: ఇప్పటివరకు అక్రమ కనెక్షన్లు ఇచ్చుకుని కరెంట్​ బిల్లులు ఎగ్గొట్టేవాళ్లను చూశాం.. కానీ, దుండిగల్ పరిధిలో ఓ వ్యక్తి అక్రమంగా ఏకంగా 30 విద్యుత్​ మీటర్లు తీసుకుని ప్రతినెలా క్రమం తప్పకుండా మినిమం బిల్లులు చెల్లిస్తూ వస్తున్నాడు. రెండేండ్లుగా ఈ తతంగం సాగుతుండగా.. పోలీస్, విద్యుత్​శాఖాధికారులు ఆదివారం రైడ్​ చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. ఎలక్ట్రికల్ ఏఈ శ్రీసాయి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సర్వే నెంబర్ 454, పల్లవి ఆశ్రమం దగ్గరలోని ఓ ప్రభుత్వ భూమి వద్ద ఎలక్ట్రికల్ సిబ్బంది, పోలీసులు దాడులు జరిపారు.

వేణు గోపాల్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లోని ఓ గదిలో 30 విద్యుత్ మీటర్లు గుర్తించారు. వాటికి రెండు సంవత్సరాలుగా బిల్లులు చెల్లిస్తున్నట్టు తేలింది. ఎటువంటి ఇంటి నెంబర్లు లేకుండా ఎలక్ట్రిక్ మీటర్లకు పర్మిషన్లు పొందాడు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి మీటర్ల సాయంతో రెగ్యులరైజేషన్ చేయించే కుట్రలో భాగంగా ఇలా మీటర్లు తీసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మీటర్ల అనుమతుల విషయంలో స్థానిక ఎలక్ట్రిసిటీ అధికారులు, సిబ్బంది చేతివాటం ఉన్నట్టు తేలింది. ఏఈ ఫిర్యాదు మేరకు ఆదివారం నిందితుడు వేణుగోపాలును అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు.