భోపాల్ : ముద్దులొలికే మా రామ చిలుక ఎక్కడికో ఎగిరిపోయింది. దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాం. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. తప్పిపోయిన రామచిలుకను పట్టిస్తే నగదు బహుమతిగా ఇస్తామంటూ పోస్టర్లతో ప్రకటన ఇచ్చాడో వ్యక్తి. పెంపుడు చిలుకను పట్టి తెచ్చిస్తే రూ.10 వేలు బహుమతిగా ఇస్తామటూ ప్రకటించాడు మధ్యప్రదేశ్ కు చెందిన దీపక్ సోని అనే వ్యక్తి.
దీపక్ సోనీ పెంపుడు చిలక ఎక్కడికో ఎగిరిపోవడంతో దాని ఫొటోలతో పోస్టర్లు వేయించాడు. దానిని కనిపెట్టిన వారికి రివార్డు ఇస్తానని ప్రకటించాడు. గత నెలలోనూ ఒకసారి ఎగిరిపోయి.. తిరిగి ఇంటికి వచ్చిందని, ఈసారి కూడా ఎగిరిపోయిందని, అయితే.. ఎంతకూ తిరిగి రాలేదని చెప్పాడు. ఎగిరిపోయిన చిలుక మళ్లీ తిరిగి వస్తుందని తమ కుటుంబ సభ్యులందరూ ఎదురుచూస్తున్నారని తెలిపాడు దీపక్ సోనీ.
చిలుక తప్పిపోయిన సమయంలో సరిగా ఎగరలేకపోతుందని, వీధి కుక్కులు దానికేమైనా హాని చేశాయోనని ఆందోళన వ్యక్తం చేశాడు. చిలుక గత రెండేళ్లుగా తమతో ఉంటుందని, అందుకే తమ కుటుంబానికి అదంటే ఎంతో ఇష్టమని, అందుకే దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.10వేలు, అంతకంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఇప్పటికే అన్ని చోట్ల వెతికాడు. ఆటోరిక్షా డ్రైవర్లకు చెప్పాడు. చిలుక ఆచూకీ తెలిసిన వారు తన నెంబర్ కు కాల్ చేయండి అంటూ వాల్ పోస్టర్లు వేయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి.