వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. ఆన్లైన్ మోసాలకు ఓ యువకుడు బలయ్యాడు. జిల్లాలో వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి రాజు అనే యువకుడు ఆన్లైన్ గేమ్స్ మోసాలతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఒత్తిడితోనే లైశెట్టి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యుక్త వయసులో ఉన్న కొడుకు అర్థాంతరంగా చనిపోవడంతో రాజు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజు మరణం అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వర్ధన్నపేట పోలీసులు విచారణ చేపట్టారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈజీ మనీ కోసం ఆశపడి ఆన్లైన్ మోసాలకు బలికావద్దని సూచిస్తున్నారు పోలీసులు.