- నిజామాబాద్ జీజీహెచ్‌లో ఘటన
- తండ్రి పక్కన నిద్రిస్తున్న పిల్లాడిని ఎత్తుకెళ్లిన దుండగులు
- మెట్‌పల్లిలో బాలుడిని గుర్తించిన ఐడీ పార్టీ పోలీసులు
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ నగరంలోని జీజీహెచ్‌లో మూడేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఐడీ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని మెట్‌పల్లిలో గుర్తించారు. మాక్లూర్ మండలం మానిక్‌భండార్ గ్రామానికి చెందిన నాగుల సాయినాథ్, శయ దంపతులకు కుమారుడు అజయ్ (3) ఉన్నాడు. రెండో కాన్పు కోసం శయ నిజామాబాద్ హాస్పిటల్‌లో అడ్మిట్ కావడంతో ఆమె బాగోగులు చూసేందుకు సాయినాథ్ హాస్పిటల్‌లోనే ఉన్నాడు.
ఈ క్రమంలో సాయినాథ్ అజయ్‌తో కలిసి శుక్రవారం రాత్రి హాస్పిటల్ వరండాలో పడుకున్నాడు. శనివారం ఉదయం ఐదు గంటలకు లేచి చూడగా బాబు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెతికినప్పటికీ బాలుడు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు యువకులు బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో సీపీ కల్మేశ్వర్ స్పెషల్ ఐడీ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు యువకులు మెట్‌పల్లిలో ఉన్నట్లు గుర్తించి శనివారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నారు.
బాలుడుని తండ్రికి అప్పగించారు. అయితే నిందితుల్లో ఓ యువకుడి చెల్లికి సంతానం కలగకపోవడంతో ఆమె కోసం బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. మూడు రోజుల నుంచి హాస్పిటల్‌లో రెక్కీ నిర్వహించిన యువకులు శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల టైంలో బాలుడిని కిడ్నాప్ చేశారు.