ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు.. చివరకు

ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం హత్యకు దారి తీసింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే... నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో.. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారుకొండ మండలం సిరిసినగండ్లకు చెందిన నేనావత్‌ నవీన్‌ బీటెక్‌ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరితో నవీన్‌కు స్నేహం ఏర్పడింది. అయితే వీరిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయంలో ఇద్దరికి గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ నెల 17న పార్టీ చేసుకుందామని హరి... నవీన్ ను అబ్దుల్లాపూర్‌మెట్ లోని తన రూమ్ కు పిలిచాడు. ప్రియురాలు తనకు దక్కదన్న కోపంతో నవీన్ ను విచక్షణరహితంగా కొట్టి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు నవీన్ కనిపించడం లేదంటూ ఈనెల 22న నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో అతని  తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.