డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని చంపిండు

శాంతినగర్, వెలుగు: డబ్బులు అడిగితే ఇవ్వలేదని కొడుకు తల్లిని నరికి చంపాడు. సీఐ శివ శంకర్ గౌడ్, ఎస్సై శ్రీనివాస్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన రాముడు, నాగమ్మ(65)కు ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకొడుకు ప్రేమ రాజు ఎనిమిదేండ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పది రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు.

డబ్బులు కావాలని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు. శుక్రవారం ఉదయం సైతం డబ్బుల కోసం గొడవ పడ్డాడు. తర్వాత గొడ్డలి తీసుకొని ఇంటి ముందున్న చెట్టును నరకడం మొదలుపెట్టాడు. చెట్టును ఎందుకు నరుకుతున్నావని తండ్రి ప్రశ్నించాడు. దీంతో అడ్డు వస్తే మిమ్మల్ని కూడా నరికేస్తానంటూ మీదికి వచ్చాడు. తండ్రిపై దాడి చేస్తాడేమోనని తల్లి అడ్డం వెళ్లింది. ఆమెపై విచక్షణ రహితంగా గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.