- ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు సమీపంలో ఓ వ్యక్తి తన ఒంటికి నిప్పంటించుకుని సూసైడ్ అటెమ్ట్ చేయటం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన జితేంద్ర(35) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం పార్లమెంట్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న రైల్వే భవన్ వద్ద తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన పార్లమెంట్ భద్రతా సిబ్బంది, స్థానికులు..అతికష్టం మీద మంటలు ఆర్పేశారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని..కాలినగాయాలతో పడిఉన్న జితేంద్రను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. స్పాట్‌లో సగం కాలిపోయిన రెండు పేజీల నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్ ను కూడా గుర్తించారు. జితేంద్ర రైల్వే భవన్ వద్ద నిప్పంటించుకుని.. ఆపై పార్లమెంటు భవనం వైపు పరిగెత్తాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
అతనికి 90 శాతం కాలిన గాయాలయ్యాయని..బాధితుడి హెల్త్ కండిషన్ ప్రస్తుతం విషమంగానే ఉన్నదని వివరించారు. బాగ్‌పట్‌లో అతనిపై 2021లో ఓ కేసు నమోదైందని..దాని వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని చెప్పారు. జితేంద్ర ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించాడనే స్పష్టమైన వివరాలు మాత్రం ఇంకా తెలియదని వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరిస్తున్నదని..తాము కూడా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.