కల్లు చోరీ చేశాడని జరిమానా.. వ్యక్తి సూసైడ్‌‌‌‌

కల్లు చోరీ చేశాడని జరిమానా.. వ్యక్తి సూసైడ్‌‌‌‌

తొగుట/దౌల్తాబాద్‌‌‌‌, వెలుగు : ఈత కల్లు దొంగతనం చేశాడని జరిమానా విధించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌‌‌‌ మండలం ముత్యంపేట గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముత్యంపేట గ్రామానికి చెందిన ముత్యాల ఆంజనేయులు (34) ముంబైలో ఉంటూ 15 రోజుల కింద గ్రామానికి వచ్చాడు. ఈ నెల 24న ఆంజనేయులు, పంచమి పరశురాములు, తోడంగి రామచంద్రంతో కలిసి ఈత కల్లు చోరీ చేశాడంటూ గ్రామానికి చెందిన తోడంగి ఆంజనేయులు, స్వామి, కరుణాకర్, చంద్రం, ముత్యం, స్వామి, పరశురాములు, ఈరంగారి ఎల్లం 25న పంచాయితీ నిర్వహించి ముగ్గురిని చితకబాదారు. అనంతరం రూ. 2 వేలు ఫైన్‌‌‌‌ వేశారు. దీంతో తాము చోరీ చేయకున్నా నేరం మోపి ఫైన్‌‌‌‌ వేశారని మనస్తాపానికి గురైన ఆంజనేయులు సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆంజనేయులు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి సోదరుడు ముత్యాల రమేశ్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.