- బోరబండ ప్రాజెక్ట్‌లో చేపలు పట్టే విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవ
- తప్పించుకునే క్రమంలో ప్రాజెక్ట్‌లో
- పడి మృతిచెందిన వర్దరాజ్ పూర్ గ్రామస్తుడు
జగదేవపూర్, వెలుగు : రెండు గ్రామాల మధ్య చేపల పంచాయితీ వివాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జగదేవపూర్ మండలం ధర్మారం, మర్కుక్ మండలం వర్దరాజ్ పూర్ మధ్య బోరబండ ప్రాజెక్ట్ ఉంది. దీనిపై రెండు గ్రామాల మధ్య కొన్నేళ్లుగా చేపల వివాదం నడుస్తుంది. ఇప్పటికే పీఎస్‌లో ఇరువర్గాలు కంప్లయింట్లు చేసుకున్నాయి. కాగా.. శనివారం వర్దరాజ్ పూర్ గ్రామానికి చెందిన వారు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వెళ్లారు.
ధర్మారం గ్రామస్తులకు తెలియడంతో భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. వర్దరాజ్ పూర్ గ్రామస్తులు పరుగులు తీస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ముచ్చపతి సత్తయ్య (55) తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడ్డాడు. ఎవరూ గమనించకుండా వెళ్లిపోయారు. సత్తయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. ఆదివారం జగదేవపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ప్రాజెక్టు వద్ద సత్తయ్య చెప్పులు చూసి తెలపడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు, పోలీసులు వెళ్లి ప్రాజెక్టులో గాలింపు చేపట్టగా అతని డెడ్‌బాడీ దొరికింది. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.