ఈయన తెగింపు ఊరంతా వెలుగులు పంచింది..ప్రాణాన్ని లెక్కచేయకుండా కరెంటు తీసుకొచ్చాడు..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. భారీ వృక్షాలు కిందపడిపోయాయి. చాలా చోట్ల వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లా పాతర్లపహాడ్ గ్రామంలో కరెంటు పోయింది. ఊరంతా చీకటి అలుముకోవడంతో అదే గ్రామానికి చెందిన కొప్పుల సంతోష్ గౌడ్ అనే వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. 

లైన్‌మన్ వద్ద ఎలక్ట్రికల్ హెల్పర్‌ గా పని చేస్తున్న సంతోష్ గౌడ్.. ముంపునకు గురవుతున్న ప్రాంతం మధ్యలో వైరు తెగిపోవడంతో గ్రామంలో కరెంటు లేకుండా పోయిందని తెలుసుకున్నాడు. ఏ మాత్రం వెనుకంజ వేయకుండా.. భయపడకుండా ప్రమాకరంగా ప్రవహిస్తున్న నీటిలో నుంచి ఈదుకుంటూ కరెంటు స్తంభం వద్దకు వెళ్లాడు. ప్రాణాలకు తెగించి మరి కరెంటు స్తంభం ఎక్కాడు. దెబ్బతిన్న కరెంటు తీగకు మరమ్మత్తు చేశాడు. వెంటనే గ్రామంలో కరెంటు సరఫరా కావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కరెంటు స్తంభం ఎక్కి.. తీగను సరిచేసి, గ్రామంలో విద్యుత్ ను తీసుకువచ్చిన  సంతోష్ గౌడ్ ను అందరూ అభినందించారు.